Andhra Pradesh: లక్ష మందితో అవయవదాన ప్రతిజ్ఞ చేయిస్తాం: 'మెప్మా' ఎండీ చిన తాతయ్య
- ఆగస్ట్ 6న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం
- ఏపీలో ఏటా 1200 మందికి అవయవదానం అవసరం
- మెప్మా, హెల్త్ వర్శీటీ, ‘జీవన్ దాన్’ సమన్వయంతో ప్రచారం చేపడతాం
ఆగస్ట్ 6న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో లక్ష మంది చేత అవయవ దాన ప్రతిజ్ఞ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఎండీ చిన తాతయ్య చెప్పారు. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ సమావేశ మందిరంలో ‘ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించడం ఎలా?’ అనే అంశంపై ఈరోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన మెప్మా అధికారులకు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ డాక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన తాతయ్య మాట్లాడుతూ, మెప్మా, ఆరోగ్య విశ్వవిద్యాలయం, జీవన్ దాన్ ఫౌండేషన్ వారి సమన్వయంతో అవయవదానంపై అవగాహన కల్పించడానికి, పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడాదికి 1200 మందికి అవయవదానం అవసరం వస్తోందని, 20 శాతం మంది అవసరాలు మాత్రమే తీర్చగలుగుతున్నామని వివరించారు. అవగాహన లేకపోవడం, మూఢ నమ్మకాల వల్ల ఇలా జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అత్యధిక మంది నుంచి అవయవదానానికి ఆమోదం తెలిపే పత్రాలు సేకరించడానికి పూనుకున్నట్లు తెలిపారు.
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితులలో మనిషి ప్రాణాన్ని కాపాడుకునే అవయవాలను కృత్రిమంగా తయారు చేస్తున్నప్పటికీ, అవి పూర్తి స్థాయిలో మనిషిని కాపాడుకోలేక పోతున్నాయని తెలిపారు. 2017లో సుమారు 1,46,377 మంది రహదారిపై ప్రమాదాల్లో మరణించారని, వారిలో 0.1 శాతం మంది మాత్రమే అవయవ దానం చేయగలిగారని వివరించారు. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి అవయవాలు తీసుకోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రతి నిముషానికి 10 మంది మరణిస్తున్నారని, వారిలో కొద్ది మాత్రమే మరణానికి ముందు అవయవదానం గురించి ఆలోచిస్తున్నారని, సాధారణ మరణాలలో కేవలం కళ్ళు మాత్రమే దానం చేయటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మన దేశంలో రోజువారీ మరణించేవారు అవయువదానం చేయగలిగితే ఎవరూ అవయవ లోపంతో ఉండరని చిన తాతయ్య అన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ సివి రావు మాట్లాడుతూ, అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఈ కార్యక్రమం దారితప్పకుండా సరైన రీతిలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం అని, మెప్మా సిబ్బంది, విశ్వవిద్యాలయం ఎస్ఎస్ఎస్ విభాగం డాక్టర్లు కలసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 6న ఎంత ఎక్కువ మందితో అవకాశం ఉంటే అంత ఎక్కువ మందితో ప్రతిజ్ఞ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.