amaravathi: అమరావతి అంతర్జాతీయ స్థాయి క్రియేటివిటీ సెంటర్‌గా రూపొందాలి: మంత్రి నారా లోకేష్
- అమరావతిలో ఐసీటీఐఈఈ ఏపీ - 2018 సదస్సు
- విద్యార్థులు ఉద్యోగాలిచ్చే ఎంట్రప్రెన్యూర్స్ గా మారాలి
- 2029 నాటికి ప్రపంచంలో అత్యంత నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా ఏపీ
ఏపీ రాజధాని అమరావతి అంతర్జాతీయస్థాయి క్రియేటివిటీ సెంటర్‌గా రూపొందాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రాన్సఫర్మేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్- ఇంపాక్టింగ్ ది ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ (ఐసిటిఐఈఈ ఏపీ - 2018) సదస్సుకు మంత్రి లోకేష్, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీటీఐఈఈ ఏపీ 2018, గేమింగ్ డెవలప్ మెంట్ చాలెంజ్ బుక్ లెట్లను ఆవిష్కరించారు.
అనంతరం, నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2022 నాటికి దేశంలోనే అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి ప్రపంచంలో అత్యంత నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 12 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
చంద్రబాబుపై నమ్మకంతో ఏడాది క్రితం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతికి వచ్చిందని.. ఏడాదిలోనే అత్యాధునిక సదుపాయాలతో క్లాసులు మొదలయ్యాయని అన్నారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇండియన్ గేమింగ్ డెవలప్ మెంట్ చాలెంజ్ పేరుతో 500 మందికి ఫిన్ ల్యాండ్ అధ్యాపకుల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి వారిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా, ఉద్యోగాలిచ్చే ఎంట్రప్రెన్యూర్స్ గా మారాలని లోకేష్ పిలుపు నిచ్చారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,.. ఏపీఎస్ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రాన్సఫర్మేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సదస్సు జరగడం ఆనందదాయకమని, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు లక్ష్యం మేరకు ఏపీఎస్ఎస్ డీసీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోందని అన్నారు. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనే ఏపీఎస్ఎస్ డీసీ, కజాని యూనివర్సిటీ సంయుక్తంగా ఇండియన్ గేమింగ్ డెవలప్ మెంట్ చాలెంజ్ పేరుతో గేమింగ్ రంగంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఇలాంటి శిక్షణల ద్వారా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుని ఎంట్రప్రెన్యూర్స్ గా మారే అవకాశం ఉంటుందని కొల్లు రవీంద్ర అన్నారు. అంతకుముందు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ పరివేందర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుకు పునాది పడిందని, ఏడాది కాలంలోనే 2 వేల మందితో క్లాసులు ప్రారంభించినట్టు చెప్పారు. మనదేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకుంటున్నారని, వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చాలన్న ఉద్దేశ్యంతోనే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేశాయని అన్నారు. కార్యక్రమం అనంతరం ఇండియన్ గేమింగ్ చాలెంజ్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన గేమింగ్ స్టాల్స్ ను లోకేష్, కొల్లు రవీంద్ర సందర్శించారు.