Tirumala: ఆ సమయంలో స్వామిని దర్శించినా ఫలితం ఉండదు... అందుకే భక్తుల నిలిపివేత: టీటీడీ జేఈఓ

  • స్వామిలోని శక్తి పూర్ణకుంభంలో ఉంటుంది
  • తిరిగి ఆ అంశను స్వామిలోకి ప్రవేశపెట్టిన తరువాతే దర్శనాలు
  • భక్తులు అర్థం చేసుకోవాలని కోరిన శ్రీనివాసరాజు

మహా సంప్రోక్షణ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ఎటువంటి ఫలితమూ ఉండదని, వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరికి మాత్రమే దర్శనం కల్పిస్తే బాగుండదన్న కారణంతోనే స్వామి దర్శనాలను నిలిపివేశామని, అంతకుమించి మరేమీ లేదని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వ్యాఖ్యానించారు.

మహా సంప్రోక్షణ సమయంలో స్వామివారి అంశ ఓ పూర్ణకుంభంలో ఉంటుందని, గర్భగుడిలోని విగ్రహంలో ఎలాంటి శక్తీ ఉండదని ఆగమ శాస్త్రం చెబుతోందని ఆయన అన్నారు. స్వామి అంశను తిరిగి ఆలయంలోని మూల విరాట్టులోకి ప్రవేశపెట్టిన తరువాత తిరిగి దర్శనాలు ప్రారంభిస్తామని, భక్తులు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ ఆరు రోజుల పాటు ఆలయంలోకి ఎవరినీ అనుమతించబోమని, పాలక మండలి కుటుంబీకులకు కూడా ప్రవేశం ఉండదని, కేవలం రుత్వికులు మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.

కొండపైకి భక్తులను అమతించబోరన్న ప్రచారం అసత్యమని, కొండపైకి ఎంతమంది భక్తులైనా రావచ్చని, వారికి ఎప్పటిలానే అన్ని సౌకర్యాలూ ఉంటాయని, స్వామి దర్శనం మాత్రం ఉండదని తెలిపారు. 12 సంవత్సరాల క్రితం వచ్చిన భక్తులకు, ఇప్పుడు వస్తున్న భక్తులకూ చాలా వ్యత్యాసం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News