ramaprabha: నాకేదైనా జరిగితే సినిమావాళ్లకి మాత్రం చెప్పొద్దు: రమాప్రభ
- నా స్థాయిని తగ్గించేశారు
- మానసికంగా నన్ను తరిమేశారు
- ఇప్పుడు ఏడ్చేవాళ్లు ఎవరూ లేరు
రేలంగి .. రమణా రెడ్డి .. అల్లు రామలింగయ్య .. పద్మనాభం .. రాజబాబు .. చలంతో కలిసి తెలుగు తెరపై రమాప్రభ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ ఆమె వందలాది సినిమాలు చేశారు. అలాంటి రమాప్రభ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.
"ఎన్నో సినిమాలు చేసినా .. ఎంతో పేరు తెచ్చుకున్నా నాకు 'పద్మశ్రీ' ఇవ్వలేదు. నా రేంజ్ అంతగా పెరగకూడదు కదా .. అందుకే ఇవ్వలేదు. పై స్థాయిలో వున్న నన్ను కొంతమంది కిందికి దించారు. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాక .. చెన్నైలో వున్నట్టుగా ఇక్కడ ఉండకూడదు కదా .. అందుకే దూరం పెట్టారు. నా స్థాయిని తగ్గించాలని నా కన్నా తక్కువ వాళ్లే కదా అనుకుంటారు .. అప్పుడు నేనే కదా గ్రేట్ అనుకున్నాను. అందుకని నాకేదైనా అయితే 'మా' అసోసియేషన్ కి గానీ .. ఇతర సినిమావాళ్లకి గాని చెప్పొద్దని మా వాళ్లకి చెప్పాను. ఎందుకంటే ఇప్పుడున్న సినిమా వాళ్లలో ఎవరూ ఏడ్చేవాళ్లు లేరు. మానసికంగా నన్ను ఇక్కడి నుంచి తరిమింది వాళ్లే కదా. నేను విడమరిచి చెప్పలేను గానీ .. కోల్డ్ వార్ లా జరుగుతోంది" అని చెప్పుకొచ్చారు.