swamy agnivesh: స్వామి అగ్నివేష్ ను చితకబాదిన బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు
- జార్ఖండ్ లో స్వామి అగ్నివేష్ పై దాడి
- పిడిగుద్దులు గుద్దుతూ, నేలపై పడేసి లాగిన బీజేవైఎం కార్యకర్తలు
- గాయపడ్డ అగ్నివేష్ కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స
ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జార్ఖండ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంచీకి 365 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ లో ఓ కార్యక్రమానికి హాజరవడానికి అగ్నివేష్ వచ్చారు. హోటల్ నుంచి ఆయన బయటకు వస్తుండగా విల్లంబులు ధరించిన గిరిజనులు ఆయనకు భద్రతగా ఉన్నారు. ఇంతలోనే అక్కడకు ఒక్కసారిగా వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఆయనను చితకబాదారు. కిండపడేసి కొట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైశ్రీరాం అంటూ ఆయనపై దాడి చేశారు.
ఘటన అనంతరం స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ, ఎలాంటి హింసకైనా తాను వ్యతిరేకమని చెప్పారు. తనపై ఎందుకు దాడి చేశారో తనకు తెలియదని చెప్పారు. దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరానని తెలిపారు. తనపై దాడి జరిగిన సమయంలో చుట్టుపక్కల ఒక్క పోలీసు కూడా లేరని అన్నారు. బయట బీజేవైఎం కార్యకర్తలు తన కోసం వేచి ఉన్నారనే విషయాన్ని తాను హోటల్ లో ఉన్నప్పుడే తన స్నేహితులు తనకు చెప్పారని తెలిపారు.
కూర్చొని మాట్లాడుకుందాం రండని వారిని తాను ఆహ్వానించానని... కానీ ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. ఒక సెమినార్ లో పాల్గొనేందుకు తన గిరిజన మిత్రులతో కలసి వెళ్తుండగా, దాడి చేశారని తెలిపారు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే దాడికి దిగారని చెప్పారు. పిడికిళ్లతో గుద్దుతూ, కొడుతూ, రోడ్డుపై పడేసి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పదజాలాన్ని తనపై ఉపయోగించారని చెప్పారు.
దాడిలో గాయపడ్డ స్వామి అగ్నివేష్ కు స్థానిక ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అగ్నివేష్ పై జరిగిన దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని భావిస్తున్నారు. దాడికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.