TTD: టీటీడీ బోర్డులో ఇటువంటి వాళ్లు సభ్యులుగా ఉంటే మంచిది: రమణదీక్షితులు
- ఆధ్యాత్మికవేత్తలు, సమాజసేవకులు.. టీటీడీ సభ్యులుగా ఉండాలి
- ప్రస్తుతం బోర్డు సభ్యులందరూ రాజకీయనాయకులే
- అధికారులు అహంతో కొట్టుమిట్టాడుతున్నారు
టీటీడీ తీరుపై తాను ఆరోపణలు చేసిన తర్వాత భక్తుల్లో ఎంతో సంచలనం వచ్చిందని, భక్తుల్లో కొందరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని ఎదురుచూశాను కానీ, అది జరగలేదని మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'టీటీడీ బోర్డుకు ఆధ్యాత్మికవేత్తలు, సమాజసేవకులు, హిందూ సంప్రదాయాలు, దేవాలయాలు, ఆగమశాస్త్రం, వేదాలపైన నమ్మకం ఉన్న వయో వృద్ధులు సభ్యులుగా ఉంటే ఎంతో మంచి జరుగుతుంది.
కానీ, ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులో సభ్యులు అందరూ రాజకీయనాయకులే. ఎటువంటి ఆధ్యాత్మిక చింతన, సంస్కారం లేని వాళ్లు, హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేనివాళ్లే ఉన్నారు. దేవాలయాన్ని పరిరక్షించడానికి వచ్చిన అధికారులు కూడా అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారే తప్ప, సేవా భావం ఉన్నవాళ్లెవరూ లేరు. అందువల్లే, ఇటువంటి వైపరీత్యాలన్నీ జరుగుతున్నాయి. తిరుమలలో మహా సంప్రోక్షణ సమయంలో భక్తులందరూ కూడా సమావేశం కావాలి. దర్శనం కోసం టీటీడీ బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నా’ అని చెప్పారు.