ttd: భక్తుల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం: టీటీడీ ఈవో
- ఈ నెల 24న టీటీడీ బోర్డు సమావేశం
- అప్పటిలోగా భక్తులు తమ అభిప్రాయాలు చెప్పాలి
- సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం తగదు
తిరుమల ఆలయంలో మహాసంప్రోక్షణ నిర్వహించనున్న నేపథ్యంలో దేవాలయాన్ని కొన్ని రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 24న టీటీడీ బోర్డు సమావేశం ఉందని, అప్పటిలోగా భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.
భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని, మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని అనుకుంటున్నామని, ఒకవేళ ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మహా సంప్రోక్షణ సమయంలో రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు రెండు విడతలుగా భక్తులకు దర్శనం కల్పించే విషయమై యోచిస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 24న తుది నిర్ణయం తీసుకున్న తర్వాతనైనా ఈ ఆరోపణలకు తెరపడుతుందని భావిస్తున్నామని అన్నారు.