Pawan Kalyan: 2 కోట్ల మందిని ‘జనసేన’లో భాగస్వాముల్ని చేయడమే లక్ష్యం: పవన్ కల్యాణ్
- ‘జనసేన’ ఐటీ సెంటర్ ప్రారంభం
- పార్టీ నిర్మాణం ఎంతో సహనంతో కూడిన ప్రక్రియ
- సమస్యల్లో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉంటాం
జనసేన పార్టీలో రెండు కోట్ల మందిని భాగస్వాముల్ని చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్ లో ‘జనసేన’ ఐటీ సెంటర్ ను, గిడుగు వెంకటరామ్మూర్తి ఇన్ఫర్మేషన్ సెంటర్ ను ఈరోజు ఆయన ప్రారంభించారు. సామాజిక, రాజకీయ బాధ్యతతో కూడిన వ్యవస్థను ‘జనసేన’ తెలుగు రాష్ట్రాల్లో తీసుకువస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 800 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ కేంద్రంలో పని చేస్తున్నారని, స్వచ్ఛందంగా పని చేసేందుకు వచ్చిన ఐటీ నిపుణులను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా వాలంటీర్లను, పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘‘జనసేన’ నేతలకు, జనసైనికులకు ఉపయోగపడేలా ఐటీ సెంటర్, నాలెడ్జి హబ్ ఉంటాయి. ఇంతవరకూ మిస్డ్ కాల్ ద్వారా పార్టీ సభ్యులుగా 10 లక్షల మంది ఒక్క సీజన్లో చేరారు. క్షేత్ర స్థాయిలో సభ్యత్వ నమోదు కోసం 20 లక్షల సభ్యత్వ పుస్తకాలు పంపించాం. పార్టీ నిర్మాణం ఎంతో సహనంతో చేయాల్సిన ప్రక్రియ. రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు. సమస్యల్లో కూరుకుపోయి ఉన్నవారికీ, వ్యవస్థ ఇవ్వాల్సిన అండదండలకు దూరంగా ఎవరైతే ఉన్నారో వారికి జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. సమాజం కోసం, దేశం కోసం పాతికేళ్ళు ఈ రాజకీయాల్లో ఉండేందుకు నేను పని చేయాలని సిద్ధమై వచ్చాను. ఎంతో ప్రేమాభిమానాలతో ఈ ఐటీ సెంటర్ లో పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.