writer: ప్రముఖ బాలసాహిత్య రచయిత, కార్టూనిస్ట్ జగదీశ్ ఆత్మహత్య
- తెలంగాణకు చెందిన రచయిత పెండెం జగదీశ్
- చిట్యాల శివార్లలో రైలు కింద పడి ఆత్మహత్య
- జగదీశ్ మృతి వార్తతో సాహితీవేత్తల షాక్
తెలంగాణకు చెందిన ప్రముఖ బాలసాహిత్య రచయిత, కార్టూనిస్ట్ పెండెం జగదీశ్ (43) ఆత్మహత్య చేసుకున్నారు. చిట్యాల పట్టణ శివారులలోని బాల నర్సింహ స్వామి గుడికి వెళ్లే దారిలో పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. జగదీశ్ మృతి వార్త తెలిసిన సాహితీవేత్తలు విషాదంలో మునిగిపోయారు.
కాగా, జగదీశ్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామం. ప్రస్తుతం కాపర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కవిగా, రచయితగా, బాల సాహిత్యంలో ఆయన చేసిన సేవల గురించి చెప్పాలంటే.. ‘ఆనందవృక్షం’, 'పసిడి మొగ్గలు’, ‘ఉపాయం’ వంటి దాదాపు ముప్పై పుస్తకాల వరకు ఆయన రాశారు.
తెలంగాణ మాండలికంలో బాలల కథలు రాసిన తొలి రచయితగా ఆయనకు పేరుంది. ఆయన రాసిన ‘బడిపిల్లగాళ్ల కతలు’ తెలంగాణ మాండలికంలో వచ్చిన బాలల కథా సంకలనం. ఇంకా, తెలంగాణ మాండలికంలోనే ‘గమ్మతి గమ్మతి కతలు, దోస్తులు చెప్పిన కతలు’ కూడా రాశారు. జగదీశ్ రాసిన ‘గజ్జెల దెయ్యం’ పుస్తకానికి హైదరాబాద్ లోని తెలుగు యూనివర్శిటీ మూడు నెలల క్రితం ఆయనకు పురస్కారం అందజేసింది.