England: టీమిండియా విజయాలకు బ్రేక్.. వన్డే సిరీస్ ఇంగ్లండ్‌దే!

  • మూడో వన్డేలో భారత్ ఘోర పరాజయం
  • బ్యాటింగ్, బౌలింగ్ లలో విఫలం
  • 1-2తో సిరీస్ ఓటమి

భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. 2016 నుంచి వరుసగా 9 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుకుంటూ వచ్చిన టీమిండియాకు ఇంగ్లండ్‌లో పరాభవం ఎదురైంది. లీడ్స్‌లో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అన్ని రంగాల్లోనూ విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా 1-2తో సిరీస్‌ను కోల్పోయింది.
 
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి నుంచీ నెమ్మదిగా ఆడింది. 13 పరుగుల వద్ద  రోహిత్ శర్మ (2) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ..ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దినా బ్యాటింగ్ మాత్రం నత్తనడకన సాగింది. అయితే, క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝళిపిస్తారనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ధవన్ (44) అవుటయ్యాడు. ఇక ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా భారత జట్టు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ 71 పరుగులు చేశాడు. ధోనీ 42, దినేశ్ కార్తీక్ 21, హార్ధిక్ పాండ్యా 21, భువనేశ్వర్ 21, శార్దూల్ ఠాకూర్ 22 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీశారు.

అనంతరం 257 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 33 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ జేమ్స్ విన్స్ 27, జానీ బెయిర్‌స్టో 30, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 88 పరుగులు చేయగా, జో రూట్ (100) అజేయ శతకంతో జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మాత్రమే వికెట్ తీశాడు. మిగతా బౌలర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకుంది. మూడు  వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News