Parliament: నేటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు రెడీ
- 24 రోజులపాటు సమావేశాలు
- సభ ముందుకు 46 బిల్లులు
- ప్రతిపక్షాలు సహకరించాలన్న అధికారపక్షం
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. మొత్తం 24 రోజుల్లో 18 పనిదినాల్లో సమావేశాలు జరగనుండగా 46 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా సాగింది. ప్రధాని మోదీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాము లేవనెత్తే సమస్యలను పరిష్కరించకపోతే సభ జరగకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు, సభ సజావుగా సాగేందుకు పార్టీలన్నీ సహకరించాలని ప్రధాని అన్ని పార్టీల నేతలను కోరారు. టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాసం సహా అన్నిఅంశాలపైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి అనంత్‌కుమార్ స్పష్టం చేశారు. సభ సజావుగా సాగితేనే అది సాధ్యమని తేల్చి చెప్పారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లపై చర్యలు, వాణిజ్య న్యాయ సంస్థల ఏర్పాటు, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత, ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ, ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ (తలాక్ బిల్లు), డిపాజిట్ల నియంత్రణ వంటి కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి.