Almatti: ఈ సీజన్ లో తొలిసారి... తెరచుకున్న ఆల్మట్టి గేట్లు!
- ఎగువన కురుస్తున్న వర్షాలకు పోటెత్తిన వరద
- 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు
- నేడు తెరచుకోనున్న నారాయణపూర్, తుంగభద్ర గేట్లు
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టిలోకి వరద పోటెత్తగా గేట్లను ఎత్తివేశారు. ఈ నీరంతా దిగువన ఉన్న నారాయణపూర్ కు చేరుతోంది. జలాశయం శరవేగంగా నిండుతుండటంతో, నేడు నారాయణపూర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తుంగభద్ర కూడా నిండుకుండగా ఉండటంతో, ఇక వచ్చే నీరంతా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు పెట్టనుంది.
గడచిన పది రోజుల వ్యవధిలో ఆల్మట్టి డ్యామ్ లోకి 95 టీఎంసీల నీరు రావడం గమనార్హం. మొత్తం 1,705 అడుగుల గరిష్ఠ నీటిమట్టం, 129.7 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 1,701.87 అడుగుల నీరు, 113.07 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 18 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్న అధికారులు, పరిస్థితిని బట్టి మరిన్ని గేట్లు తెరుస్తామని వెల్లడించారు.
ఇక 37.64 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న నారాయణపూర్ జలాశయంలో ప్రస్తుతం 30 టీఎంసీల నీరుంది. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తున్నందున మధ్యాహ్నానికే ప్రాజెక్టు నిండుతుందని అంచనా. జూరాలలో 9.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 5.76 టీఎంసీల నీరుంది. రేపు జూరాల ప్రాజెక్టు నిండుతుందని అంచనా. తుంగభద్రకు దాదాపు 82 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో, నేడు గేట్లు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుంగభద్ర, జూరాల గేట్లు ఎత్తితే ఆ నీరంతా కృష్ణానదికి చేరుతుంది.