New Delhi: న్యూఢిల్లీ శివార్లలో కుప్పకూలిన రెండు భవంతులు... నలుగురి మృతి.. శిథిలాల కింద 30 మంది!
- నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవంతి
- పక్కనున్న భవంతిపై కుప్పకూలిన బిల్డింగ్
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవంతి, పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవంతిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇంతవరకూ నాలుగు మృతదేహాలను వెలికితీయగా, శిథిలాల కింద మరింత మంది ఉండివుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కూలిన నాలుగు అంతస్తుల భవనంలో 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్, శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రమాదంలో 50 మందికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రులకు తరలించామని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శిథిలాల కింద 30 మంది వరకూ ఉండవచ్చని అధికారులు చెబుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. గ్రేటర్ నోయిడా ఉత్తర ప్రదేశ్ పరిధిలో ఉండటంతో, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించి, సహాయక చర్యలను సమీక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.