Sujana Chowdary: వైసీపీ నేతలే మన దౌర్భాగ్యం.. రాజ్యసభలో ఒక్క వైసీపీ ఎంపీ కూడా కనిపించలేదు: సుజనా చౌదరి

  • వైసీపీ రాజ్యసభ సభ్యులు బీఏసీ మీటింగ్ కు కూడా రాలేదు
  • బీజేపీతో వైసీపీ లాలూచి క్లియర్ గా తెలుస్తోంది
  • అవిశ్వాసం చర్చ సందర్భంగా కేంద్రాన్ని నిలదీస్తాం

గత పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి బీజేపీనే కారణమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. శుక్రవారంనాడు అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించారని... సభ సజావుగా సాగాలనేదే టీడీపీ ఆకాంక్ష అని... అయితే, తొలుత ఏపీ సమస్యలనే వినాలని తాము కోరుతున్నామని చెప్పారు. అవిశ్వాసంపై చర్చకు తమకు నాలుగు గంటల సమయం కేటాయించాలని కోరామని... అయితే, సభాసమయం తక్కువగా ఉండటంతో రెండు గంటలు కేటాయిస్తామని చెప్పారని, అవసరాన్ని బట్టి సమయాన్ని పెంచుతామని చెప్పారని తెలిపారు.

మన దౌర్భాగ్యం వైసీపీ నేతలే అని సుజనా చౌదరి విమర్శించారు. గత సమావేశాల్లో అవిశ్వాసం పెట్టిన వైసీపీ ఎంపీలు... కీలక సమయంలో పారిపోయారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో వైసీపీకి ఇద్దరు సభ్యులున్నప్పటికీ... వారెవరూ సభలో కనిపించలేదని, కనీసం బీఏసీ సమావేశానికి కూడా హాజరుకాలేదని దుయ్యబట్టారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడిన విషయం ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతోందని అన్నారు. హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వాన్ని చర్చ సందర్భంగా నిలదీస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో విపక్షాలన్నీ టీడీపీకి సహకరించాయని తెలిపారు.  

  • Loading...

More Telugu News