jagna: జగన్ పార్టీకి తలకాయ మోకాళ్లలో ఉందంటున్నారు: రఘువీరారెడ్డి
- లోక్‌సభలో కాంగ్రెస్ అవిశ్వాసం ఇవ్వడం సంతోషం
- టీడీపీ, వైసీపీల కారణంగానే ప్రత్యేక హోదా రాలేదు
- వైసీసీ, టీడీపీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంకు నోటీస్ ఇవ్వడం పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి గత నాలుగేళ్ళుగా టీడీపీ, జగన్ పార్టీ లు మద్దతు ఇవ్వడం మూలంగానే ఏపీకి ప్రత్యేక హోదా అమలు కాలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేస్తామని చెబుతున్నా వాస్తవం గుర్తించకుండా వైసీపీ, టీడీపీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ ప్యూహంలో భాగంగానే జగన్ పార్టీ తమ ఐదుగురు ఎంపీలను బలి చేసిందని, జగన్ పార్టీకి తలకాయ మోకాళ్లలో ఉందని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయని అన్నారు. ఏపీలో మీడియా శక్తులు ప్రాంతీయ పార్టీల పక్షం వహిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల హక్కులను కాలరాశారని, అసెంబ్లీకి వెళ్లని వైసీపీకి ప్రజలు అధికారం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజ్ ను ఆమోదించిన చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని రఘువీరా విమర్శించారు.