cuddapah: ఆన్ లైన్ విశ్వవిద్యాలయ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం: మంత్రి గంటా
- గంటాకు ఆర్జీ యూకేటీ చాన్సలర్ వినతి
- ఆగష్టు 4 న ఇడుపులపాయలో స్నాతకోత్సవం
- మంత్రి గంటాను ఆహ్వానించిన చాన్సలర్ రాజ్ రెడ్డి
ఒక గ్రామంలో కేజీ నుంచి పీజీ వరకు ఎవరైనా చదువుకునేలా వినూత్న పథకానికి సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించి, దానికి అనుగుణంగానే ఆన్ లైన్ వర్శటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) చాన్సలర్ ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి హామీ ఇచ్చారు.
విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గంటాను రాజ్ రెడ్డి ఈరోజు కలిశారు. ఈ మేరకు ఓ నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఫ్యాకల్టీలో కొంత మందిని పర్మినెంట్ గా తీసుకోవాలన్న రాజ్ రెడ్డి వినతిపై గంటా సానుకూలంగా స్పందించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని దూబగుంటలో ఏర్పాటు చేయనున్న త్రిపుల్ ఐటి భవన నిర్మాణాలకు శంకుస్థాపన అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్ రెడ్డికి గంటా పలు సూచనలు చేశారు. పాత బకాయిలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రాజ్ రెడ్డి కోరారు.
ఒకే గ్రామం లేదా క్యాంపస్ లో కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే కొత్త విధానంపై గంటాకు రాజ్ రెడ్డి వివరించారు. ఈ పథకంపై సమగ్ర నివేదికను గంటాకు ఆయన అందజేశారు. ఈ విషయమై సీఎంతోనూ, క్యాబినెట్ లోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని గంటా వెల్లడించారు. ఆగష్టు 4 న ఇడుపులపాయలో నిర్వహించే స్నాతకోత్సవానికి రావాలని కోరుతూ గంటాను ఆయన ఆహ్వానించారు.