Naram krishna Rao: హైదరాబాద్ దాహార్తిని తీర్చిన నారం కృష్ణారావు ఇక లేరు!
- గుండెపోటుతో మృతి
- తాగునీటి సరఫరాలో కీలక పాత్ర
- వివిధ హోదాల్లో విధులు
మెట్రో వాటర్ బోర్డు వ్యవస్థాపక చైర్మన్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ నారం కృష్ణారావు (93) మృతి చెందారు. హైదరాబాద్, నారాయణగూడలోని ఆయన స్వగృహంలో మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన నారం నగర ప్రజల దాహార్తిని తీర్చారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ వాణిజ్య భవనాలను నిర్మించడాన్ని, సాగర్‌లోకి మురికి నీళ్లు వదలడాన్ని అప్పట్లో ఆయన తప్పుబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్న నారం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ చేశారు. 1972 నుంచి 1983 వరకు ప్రజారోగ్యం, మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగాల్లో పలు హోదాల్లో సేవలందించారు.1983లో ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేశారు.
కృష్ణారావుకు కుమార్తెలు శాంత, శీల, విజయలక్ష్మి, కుమారుడు అరుణ్ కుమార్ ఉన్నారు. భార్య పుష్ప ఏడేళ్ల క్రితమే మరణించగా, అమెరికాలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పనిచేసిన మరో కుమారుడు రమేష్ ఇటీవలే మరణించారు.