TV Show: టీవీ షో లైవ్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది చెంపలు పగలగొట్టిన ముస్లిం మతపెద్ద.. అరెస్ట్!
- ట్రిపుల్ తలాక్‌పై టీవీలో చర్చా కార్యక్రమం
- సుప్రీం న్యాయవాదితో వాగ్వాదం
- ఆగ్రహంతో దాడి.. అవాక్కయిన యాంకర్
ట్రిపుల్ తలాక్‌పై ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రెచ్చిపోయిన ముస్లిం మతపెద్ద.. మహిళా న్యాయవాదిపై దాడి చేశారు. ఆమె చెంపలు వాయించారు. దీంతో, ఈ షో చూస్తున్న ప్రేక్షకులతోపాటు షోలో పాల్గొన్న మిగతావారు, టీవీ యాంకర్ అవాక్కయ్యారు. వెంటనే వారిని విడిపించే ప్రయత్నం చేసినా ఆయన ఆగలేదు సరికదా.. వారిని తోసుకుంటూ మరిన్నిసార్లు ఆమెపై దాడిచేశాడు.
‘జీ హిందూస్తాన్’ న్యూస్ చానల్ ట్రిపుల్ తలాక్‌పై చర్చా కార్యక్రమం నిర్వహించింది. మౌలానా ఎజాజ్ అర్షద్ ఖాస్మి, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరా ఫయాజ్ తదితరులు చర్చకు హాజరయ్యారు. చర్చ జరుగుతుండగా ఎజాజ్, ఫరా మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ముదిరింది. షో లైవ్ టెలికాస్ట్ అన్న విషయాన్ని మర్చిపోయిన ఎజాజ్ నిలబడి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఫరా కూడా లేచి వాదించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో రెచ్చిపోయిన ఎజాజ్ మహిళా న్యాయవాదిపై దాడి చేశాడు. ఆమె చెంపలు వాయించాడు. వెంటనే అప్రమత్తమైన మిగతా సభ్యులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోని ఎజాజ్ మరోమారు ఆమెపై దాడి చేశాడు. టీవీ చానల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎజాజ్‌ను అరెస్ట్ చేశారు.