rangasthalam: ‘జిగేల్ రాణి’ పాటకు ఇంకా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు: సింగర్ వెంకటలక్ష్మి
- ఈ విషయం రెండ్రోజుల్లో ఓ కొలిక్కి వస్తుంది
- నాకు అన్యాయం జరగదని సుకుమార్, దేవీశ్రీ చెప్పారు
- మాటిచ్చారు కనుక తప్పకుండా చేస్తారనే ఆశిస్తున్నా
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం విడుదలై వందరోజులు కూడా పూర్తయింది. ఈ చిత్రంలోని ఐటం సాంగ్ ‘జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి...’ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే, ‘జిగేల్ రాణి’ పాట పాడిన సింగర్ వెంకటలక్ష్మికి మాత్రం ఇంత వరకూ రెమ్యూనరేషన్ అందలేదట. అనకాపల్లికి చెందిన వెంకటలక్ష్మి స్టేజ్ ఆర్టిస్ట్. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పింది.
ఈ ఇంటర్వ్యూలో వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ‘అసలు, ఈ పాట నేను పాడానంటే నాకే ఆశ్చర్యమేసింది. నేను పాడిన ఈ పాట సినిమాలో ఉంటుందో, ఉండదో అని మొదట్లో అనుకున్నా. దేవీశ్రీ ప్రసాద్ గారు మాత్రం ఈ పాట హైలైట్ అవుతుందని, ఈ పాటను తీసేయడం జరగదని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే అలాగే ఆ పాట హైలైటయింది. అందరి నోట్లో ఈ పాట వింటుంటే చాలా గర్వంగా, హ్యాపీ గా ఉంది. కానీ, అందరి దృష్టిలో పడలేకపోయానని బాధ కూడా ఉంది. నేను చిన్నప్పటి నుంచి బుర్రకథ ఆర్టిస్ట్ ని. సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ గారు మా బుర్ర కథను ‘యూట్యూబ్’ లో చూసి ‘జిగేల్ రాణి’ పాట పాడేందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.
ఈ పాట పాడే అవకాశమొచ్చినప్పుడు నాకు ఎంత డబ్బు ఇస్తారనే విషయం నేను పట్టించుకోలేదు. పాట పాడే అవకాశం వచ్చినందుకు ఆనందపడ్డాను. ఎంతో కొంత డబ్బు ఇస్తారని నాకు తెలుసు. బుర్రకథ చెప్పడానికి వెళితే ఐదొందలు, వెయ్యి రూపాయలు వస్తుంటాయి. ఇలా పాట పాడేందుకు వెళితే పెద్ద మొత్తంలో వస్తుందని తెలుసు. కానీ, ఇంకా, నాకు డబ్బులు రాలేదు.
దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం రెండ్రోజుల్లో ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నా. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ తో పాటు వారి పీఏలు కూడా నాతో మాట్లాడారు. నాకేమీ అన్యాయం జరగదని.. హెల్ప్ చేస్తామని, ఆర్థికంగా కూడా ఆదుకుంటామని వాళ్లు చెప్పారు. మాటిచ్చారు కనుక తప్పకుండా చేస్తారనే ఆశిస్తున్నాను. ఈ రెండ్రోజుల్లో వాళ్ల నుంచి నాకు ఫోన్ కాల్స్ రావొచ్చు. సినిమాల్లో ఇలా పాడే అవకాశాలు వస్తే తప్పకుండా పాడతాను’ అని చెప్పుకొచ్చారు.