Bay of Bengal: తెలంగాణలో రేపు దంచికొట్టనున్న వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
- కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టికి అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు దంచి కొడతాయని, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతంలోనూ అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, నిన్న భూపాలపల్లి జిల్లా పెరూర్ లో 4 సెం.మీ, భూపాలపల్లిలో 2 సెం.మీ. వెంకటాపురం, కాళేశ్వరం, మంచిర్యాల, గంగాధర తదితర ప్రాంతాల్లో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది.