Tirupati: హోంవర్క్ చేయలేదని ఇంటర్ విద్యార్థిని బూటు కాలితో తన్నిన అధ్యాపకుడు!
- రేపు చేసుకొస్తానన్నా వినిపించుకోని లెక్చరర్
- బూటు కాలితో తన్నిన వైనం
- రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పనిచేయకుండా నిషేధం
తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు ఇంటర్ విద్యార్థిని బూటు కాలితో తన్నడంపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అధ్యాపకుడు అంతగా విరుచుకుపడడానికి కారణం.. విద్యార్థికి అప్పగించిన హోం వర్క్ చేయకపోవడమే. మంగళం ప్రాంతానికి చెందిన విద్యార్థి అన్నమయ్య కూడలి సమీపంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
బుధవారం రోజులాగే కళాశాలకు వెళ్లి వచ్చిన విద్యార్థి ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో గాభరా పడిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హోం వర్క్ చేయలేదన్న కారణంతో తనను బూటుకాలితో తన్నాడని ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. రేపు చేసుకొస్తానన్నా వినకుండా ‘నువ్వేంది నాకు చెప్పేది’ అంటూ తన్నాడని పేర్కొన్నాడు.
విద్యార్థి సంఘాలతో కలిసి గురువారం కళాశాలకు చేరుకున్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్ఐవో కృష్ణయ్య కాలేజీకి వచ్చి తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చలు జరిపారు. విద్యార్థిని తన్నిన ఉపాధ్యాయుడు రాష్ట్రంలోని మరే కళాశాలలోనూ పనిచేయకుండా నిషేధం విధిస్తూ నోటీసులు జారీ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా విరమించారు.