TRS: అడగాల్సింది అడిగి, చెప్పాల్సింది చెప్పి వాకౌట్: టీఆర్ఎస్
- ఓటింగ్ లో పాల్గొనరాదని నిర్ణయం
- పనిలో పనిగా టీడీపీ వైఖరిపైనా విమర్శలు
- ఎంపీలకు అధినేత దిశానిర్దేశం
నేడు లోక్ సభలో జరిగే అవిశ్వాస తీర్మానం తరువాత ఓటింగ్ లో పాల్గొనరాదని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ ఉదయం 11 గంటల నుంచి చర్చ ప్రారంభం కానుండగా, తమకు అవకాశం వచ్చిన వేళ, విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీయాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెబుతూనే, ఏపీకి ఇస్తే తమకూ ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించినట్టు టీఆర్ఎస్ నేతలు వెల్లడిస్తున్నారు.
ఇదే సమయంలో హైకోర్టు తరలింపు, సచివాలయం అప్పగింత, కొన్ని ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయకపోవడం తదితరాలపై టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడాలని కూడా టీఆర్ఎస్ అధినేత నుంచి తెలుగుదేశం ఎంపీలకు సలహా వెళ్లినట్టు తెలుస్తోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలో ఉండాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న వేళ, తెలుగుదేశం పార్టీ కలసి రాలేదని, అందువల్ల ఇప్పుడు ఆ పార్టీకి తామెందుకు సహకరించాలని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సభలో చర్చ పూర్తయి, ఓటింగ్ జరగడానికి ముందు దాన్ని బహిష్కరించి, వాకౌట్ చేయాలని నిర్ణయించామని టీఆర్ఎస్ ప్రకటించింది.