Assam: ఉద్యోగం కోసం అడ్డదార్లు... బీజేపీ ఎంపీ కుమార్తె పల్లవి శర్మ అరెస్ట్!
- రెండేళ్ల క్రితం అసోంలో 'క్యాష్ ఫర్ జాబ్' స్కామ్
- రూ. 30 లక్షల వరకూ లంచమిచ్చి ఆన్సర్ షీట్ల మార్పు
- చేతి దస్తూరీ సరిపోకపోవడంతో అరెస్టులు
రెండు సంవత్సరాల క్రితం అసోంలో సంచలనం రేపిన 'క్యాష్ ఫర్ జాబ్' స్కామ్ లో తేజ్ పూర్ బీజేపీ ఎంపీ ఆర్పీ శర్మ కుమార్తె పల్లవి శర్మ సహా మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ఆన్సర్ షీట్లలో ఉన్న రాతకు, వారి దస్తూరికీ సంబంధం లేకపోవడంతోనే అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసులో అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాకేష్ కుమార్ సహా 63 మందిని గతంలో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పుడు ఎనిమిది మంది మహిళలు సహా 19 మందిని అరెస్ట్ చేసినట్టు దిబ్రూగఢ్ ఎస్పీ సురజీత్ సింగ్ పనేసర్ వెల్లడించారు. వీరంతా తమ ఆన్సర్ షీట్లను మార్చేందుకు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ చెల్లించారని ఆయన తెలిపారు. వీరందరినీ 11 రోజుల పోలీసు కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారని తెలిపారు.