no confidence motion: సస్పెన్స్ కొనసాగిస్తున్న శివసేన.. బీజేపీలో టెన్షన్!
- ఇంతవరకు బీజేపీకి మద్దతు ప్రకటించని శివసేన
- కాసేపట్లో ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకుంటారన్న సంజయ్ రౌత్
- మరోపక్క సామ్నా విమర్శలు
అవిశ్వాసంపై పార్లమెంటులో చర్చ జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు బీజేపీకి సొంతంగానే మెజార్టీ ఉన్నప్పటికీ... మిత్రపక్షమైన శివసేన వైఖరి ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో శివసేన ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, లోక్ సభలో ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభమవుతుందని... 10.30 నుంచి 11 గంటల మధ్యలో తమ అధినేత ఉద్ధవ్ థాకరే మద్దతుకు సంబంధించి నిర్ణయాన్ని వెలువరిస్తారని తెలిపారు.
మరోవైపు తన సొంత పత్రిక సామ్నాలో బీజేపీపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగినప్పటికీ... ఈ ఆర్థిక వ్యవస్థ రైతుల మరణాలను మాత్రం ఆపలేకపోతోందని విమర్శించింది. బీజేపీకి సొంత బలం ఉన్నందున అవిశ్వాసాన్ని ఎదుర్కొంటుందని... కండబలంతో గెలిచినంత మాత్రాన, అది విజయం అనిపించుకోదని పేర్కొంది.