Chandrababu: ప్రధాని సమాధానాలను బట్టి మన భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది: చంద్రబాబు
- టీడీపీ పోరాటం వల్లే అవిశ్వాసం చర్చకు వచ్చింది
- బీజేపీకి ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకమనేది తేలిపోతుంది
- కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టండి
అనారోగ్య సమస్యలున్నా అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఎంపీలకు అభినందనలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత సమస్యల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రుజువు చేశారని కితాబిచ్చారు. తెలుగుదేశం చేసిన పోరాటం ఫలితంగానే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చిందని చెప్పారు. చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సూచించారు. బీజేపీకి ఎవరు అనుకూలంగా ఉన్నారో, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఈరోజు తేలిపోతుందని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు షో చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని అన్నారు.
వైసీపీకి పోరాట స్ఫూర్తి లేదని, కేవలం ఉనికి కోసమే ఆరాటపడుతోందని చంద్రబాబు విమర్శించారు. చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చే సమాధానాన్ని బట్టి మన కార్యాచరణ ఉంటుందని చెప్పారు. లోక్ సభలో జరగబోతున్న దాని గురించి యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోందని చెప్పారు. ఆధిక్యత ముఖ్యమా? లేక నైతికత ముఖ్యమా? అనే రీతిలో చర్చ ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు.