Lok Sabha: లంచ్ లేదు... ఆరు గంటల్లోపు అయిపోవాల్సిందే: సుమిత్రా మహాజన్
- చర్చ సజావుగా సాగాలి
- అవాంతరం లేకుండా సాగేందుకు సహకరించాలన్న స్పీకర్
- సమయం సరిపోదన్న ఖర్గే
నేడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై సాయంత్రం ఆరు గంటలలోపు చర్చ ముగిసిపోవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. చర్చ సజావుగా సాగాలన్నది తన అభిమతమని, అవాంతరం లేకుండా చర్చ సాగేందుకు మధ్యాహ్న భోజన విరామాన్ని రద్దు చేస్తున్నానని అన్నారు. చర్చలో పాల్గొని మాట్లాడేవారు సమగ్రంగా, క్లుప్తంగా మాట్లాడాలని కోరారు.
ఆ సమయంలో ఖర్గే తనకు మాట్లాడే అవకాశం కావాలని అడిగి, ఇది చాలా ముఖ్యమైన అంశమని, రెండు లేదా మూడు రోజుల పాటు సాగాల్సిన చర్చని చెప్పారు. తమకు కేవలం అరగంట సమయం మాత్రమే ఇచ్చారని, కొన్ని పార్టీలకు ఒకటి, రెండు నిమిషాల సమయం మాత్రమే దక్కిందని, అన్ని అంశాలనూ చర్చించేందుకు సమయం సరిపోదని అన్నారు.