galla jayadev: గల్లా జయదేవ్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ ఎంపీలు
- కేంద్ర ప్రభుత్వాన్ని ఏకి పారేసిన గల్లా జయదేవ్
- తలుపులు మూసి అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారంటూ ఆగ్రహం
- గల్లా వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ అడ్డుతగిలిన టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. విభజన నేపథ్యంలో కీలకమైన వన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయని... ఏపీ అన్యాయానికి గురైందని అన్నారు. ఆస్తులను తెలంగాణకు, అప్పులను ఏపీకి ఇచ్చారని దుయ్యబట్టారు. తెలంగాణకు ఆదాయాన్ని ఇస్తున్న పలు విషయాలను ఆయన వివరించారు. తలుపులు మూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు గల్లా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని... అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న గల్లా వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం ఏర్పడింది. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడాలంటూ టీఆర్ఎస్ ఎంపీలను స్పీకర్ సుమిత్ర కోరారు. అయినా టీఆర్ఎస్ ఎంపీలు శాంతించకపోవడంతో.. గల్లా కాసేపు ఆయన సీట్లో కూర్చుండిపోయారు. అనంతరం తన ప్రసంగాన్ని మళ్లీ కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గల్లా ప్రసంగానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. ఇతరుల మాటలు రికార్డుల్లోకి ఎక్కవని, గల్లా జయదేవ్ మాటలు మాత్రమే రికార్డుల్లోకి వెళతాయని ఈ సందర్భంగా స్పీకర్ చెప్పారు.