Narendra Modi: నరేంద్ర మోదీ సర్కారును ఏకేసిన గల్లా జయదేవ్!
- నరేంద్ర మోదీ పాలనపై తీవ్ర అసంతృప్తి
- పారదర్శకత, నమ్మకం, ప్రాధాన్య, హామీపైనే అవిశ్వాసం
- 5 కోట్ల మంది తరఫున మాట్లాడుతున్నానన్న గల్లా
ఇచ్చిన మాటను నిలుపుకోలేని నరేంద్ర మోదీ పాలనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ విరుచుకుపడ్డారు. అందుకే తమ రాష్ట్రంలో ధర్మపోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తోందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన పారదర్శక సంబంధాలను మోదీ తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. తాము నాలుగు కారణాలతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని చెప్పిన ఆయన, పారదర్శకత, నమ్మకం, ప్రాధాన్యత, మాట నిలబెట్టుకోవడం అన్న అంశాలపై తమకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని చెప్పారు.
పారదర్శకంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించలేదని, రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారని, నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదని, పలు విభజన హామీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. తాను 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల తరఫున మాట్లాడుతున్నానని అన్నారు.
తెలంగాణలో ఉన్న ఎన్నో విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలు పాత పేరుతో కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్ లో లేవని చెప్పారు. 2014లో పార్లమెంట్ తలుపులు మూసేసి, నిర్దయగా విభజించారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు జయదేవ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్పీకర్ వారించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ఎంపీలకు మద్దతు పలకడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.