Congress: నెలకు రూ.35 అద్దె కూడా కట్టలేకపోతున్న కాంగ్రెస్.. యూపీలో దయనీయంగా పార్టీ పరిస్థితి!
- దశాబ్దాలుగా అద్దె చెల్లించని కాంగ్రెస్
- పలు కీలక ఘట్టాలకు మౌన సాక్షిగా నిలిచిన కార్యాలయం
- రాహుల్, రాజ్ బబ్బర్లకు నోటీసులు
ఈ విషయం తెలిస్తే కాంగ్రెస్ మరీ ఇంత దీనస్థితిలో ఉందా? అన్న అనుమానం రాకపోదు. అలహాబాద్‌లో ఆ పార్టీ కార్యాలయం కోసం తీసుకున్న భవనానికి దశాబ్దాలుగా అద్దె చెల్లించడం లేదు. ఆ అద్దె మరీ చెల్లించలేనంత ఏమీ కాదు. నెలకు రూ.35 మాత్రమే. నగరంలోని చౌక్ ప్రాంతంలో తీసుకున్న భవనానికి సంవత్సరాల తరబడి అద్దె చెల్లించకపోవడంతో అది కాస్తా రూ.50వేలు అయి కూర్చుంది. 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం ఎన్నో కీలక ఘట్టాలకు మౌన సాక్షిగా నిలిచింది. సీనియర్ నేతలు పీడీ టాండన్, కమలా నెహ్రూ, ఇందిరాగాంధీ తదితరులు ఇక్కడ పలు సమావేశాలు నిర్వహించారు.
భవనం యజమాని రాజ్ కుమార్ సారస్వత్ కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేస్తూ అద్దె చెల్లించని కారణంగా భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని గతంలోనే కోరారు. తాజాగా మరోమారు నోటీసులు పంపించారు. జూలై నెలాఖరులోగా తనకు రావాల్సిన అద్దె చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ చీఫ్ రాజ్ బబ్బర్లకు లేఖ రాశారు.
250 మంది ఆఫీస్ బేరర్లు, సిటీ కాంగ్రెస్ కమిటీ నుంచి డబ్బులు సేకరించి అద్దె చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కిశోర్ వర్షిణీ తెలిపారు.