TRS: మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు: లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్
- ఏడు మండలాలను ఏపీలో కలిపేశారు
- తొలి కేబినెట్ సమావేశంలోనే మోదీ కేబినెట్ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది
- ఆ ఏడు మండలాలను మళ్లీ తెలంగాణలో కలపాలి
దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆకాంక్షలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మోదీ ప్రభుత్వం పట్ల గుర్రుగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణకు వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారని... తమకు ఎంతో కీలకమైన ఏడు మండలాలను ఏపీలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు కలసి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ మండలాలను ఏపీలో కలిపేంత వరకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోనని మోదీకి చెప్పినట్టు చంద్రబాబు ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని అన్నారు.
ఈ ఏడు మండలాలను మళ్లీ తెలంగాణలో కలిపేందుకు, పార్లమెంటులో అమెండ్ మెంట్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మండలాలను ఏపీలో కలపడం వల్ల సీలేరు పవర్ ప్రాజెక్టు ఏపీకి వెళ్లిపోయిందని చెప్పారు. తెలంగాణకు ఉన్న కరెంటు కష్టాలను ఇది మరింత పెంచిందని అన్నారు. అయితే పక్క రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు లేకుండా చేశారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలోని రైతులకు 24 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.