sowgath roy: గాలిలో తిరిగే వాళ్లు ప్రధాని అయితే దేశానికి అంత మంచిదికాదు: సౌగత్ రాయ్
- ప్రధాని మోదీ ట్రావెల్ సేల్స్ మెన్ గా మారారు
- దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి
- కేంద్రంపై విశ్వాసం లేదనేందుకు ఇదే నిదర్శనం
కేంద్రంపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమే టీడీపీ అవిశ్వాస తీర్మానమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ఈరోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అవిశ్వాసం అంటే సంఖ్యాబలానికి సంబంధించింది కాదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని తమ నాయకురాలు మమతాబెనర్జీ పదేపదే చెబుతున్నారని, ప్రధాని మోదీ ట్రావెల్ సేల్స్ మెన్ గా మారారని, గాలిలో తిరిగే వాళ్లు ప్రధాని అయితే, దేశానికి అంత మంచిదికాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి ఏటా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉందని, కనీస మద్దతు ధర కంటితుడుపు చర్యగానే ఉందని, వరికి కనీస మద్దతు ధరను రూ.2 వేల నుంచి రూ.2,500 ఇవ్వాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.
పెద్దనోట్ల రద్దుతో 25 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, ఇది దేశానికి ప్రధాని ఇచ్చిన బహుమతి అని, నల్లధనం విషయంలో కేంద్రం ఏమి సాధించింది? అని ప్రశ్నించారు. ఖరీఫ్ అమ్మకాలు, రబీ కొనుగోళ్ల సమయంలో పెద్దనోట్లు రద్దు చేశారని, పెద్దనోట్లు రద్దు అనంతరం బ్యాంకులన్నీ నోట్ల మార్పిడిలో మునిగిపోయాయని, రైతులకు కనీసం పంట రుణాలు ఇచ్చే తీరిక కూడా వాటికి లేదని మండిపడ్డారు.కిసాన్ ర్యాలీల పేరుతో వేల కోట్ల రూపాయలను ప్రధాని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ కుంభకోణాలు ఎవరి హయాంలో జరిగాయి? అని ప్రశ్నించిన సౌగత్ రాయ్, దేశ వ్యాప్తంగా జరిగిన మూక దాడుల్లో ప్రజలు మరణిస్తున్నా కేంద్రం నుంచి స్పందన ఉండదని విమర్శించారు.