rajnath singh: ప్రతిపక్షాల్లో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకనే మాపై అవిశ్వాసం పెట్టారు: రాజ్ నాథ్ సింగ్
- 30 ఏళ్ల తర్వాత స్పష్టమైన మెజారిటీతో ఏర్పడ్డ కాంగ్రెస్సేతర ప్రభుత్వం మాది
- తిరుగులేని జనాకర్షణ నేత ప్రధాని మోదీ
- ప్రజా నాయకుడికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టారు
ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానం అనేది పార్టీల హక్కు అని, ప్రధాని మోదీ తమతో చర్చించి దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉందని, కాలం మారినా, ఎంత పెద్దవారైనా..వ్యక్తుల్లో అహంకారం పెరగకూడదని అన్నారు. పాతికేళ్ల క్రితం బీజేపీ అడుగుపెట్టని చోట కూడా నేడు తమ పార్టీ విజయం సాధించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతోందని అన్నారు. కేరళ, త్రిపుర, లడక్ లో స్థానికంగా బీజేపీ పుంజుకుంటోందని చెప్పారు.
నాడు వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, యూపీఏ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తాము ఆ ఆలోచన చేయలేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పి తాము అవిశ్వాసం పెట్టలేదని అన్నారు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత స్పష్టమైన మెజార్టీతో ఏర్పడిన కాంగ్రెస్సేతర ప్రభుత్వం తమదని అన్నారు.
తిరుగులేని జనాకర్షణ ఉన్న నేత ప్రధాని మోదీ అని, ప్రజా నాయకుడికి వ్యతిరేకంగా ఇవాళ అవిశ్వాసం తీసుకొచ్చారని, ప్రతిపక్షాలన్నీ కలిసి తమపై అవిశ్వాసం పెట్టారని, వారిలో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని విమర్శించారు. సభలో చాలా మంది పెద్దలు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశం భారత్ అని అన్ని సంస్థలు చెబుతున్నాయని అన్నారు. సంస్కరణలతో భారత్ ను ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా మార్చామని, అదే, గత ప్రభుత్వం హయాంలో జీడీపీ నేల చూపులు చూస్తే, ద్రవ్యోల్బణం పైకి చూసేదని విమర్శించారు.