jena sena: అవిశ్వాస తీర్మానంపై చర్చ నిరాశకు గురిచేసింది: జనసేన
- ప్రత్యేకహోదాపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు
- హోదా, హామీలపై పోరాడుతున్న ఏకైక పార్టీ ‘జనసేన’
- ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం అన్నారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ చర్చలో వ్యవహరించిన తీరుని తప్పుబట్టారు. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం మొదట్లోనే 'భరత్ అనే నేను' సినిమా గురించి చెప్పడం, అవిశ్వాస తీర్మానం ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదని మరో తెలుగుదేశం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడం చూస్తుంటే.. అవిశ్వాసంపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతుందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ ప్రత్యేక హోదా, విభజన హామీలపై బలమైన పోరాటం చేసి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రత్యేకహోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ‘జనసేన’ అని, కాకినాడలో ప్రత్యేక ప్యాకేజ్ ని పాచిపోయిన లడ్డూలతో పోల్చింది తమ అధినేత పవన్ కల్యాణ్ గారేనని గుర్తు చేశారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాయింట్ ఫ్యాక్ట్ ఫెండింగ్ కమిటీ వేసి రూ.74 వేల కోట్లు రావాలని లెక్కలు తేలిస్తే ఏ పార్టీ దాని గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాతోనే అభివృద్ధి సాధ్యమని, హోదా పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఆర్టికల్ 4లో కూడా హోదా ఇవ్వాలని ఉందని, అధికారంలోకి రాగానే ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు వెంకయ్యనాయుడు కూడా చెప్పారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో రాష్ట్రానికి హోదా, విభజన హామీల అమలుపై బలంగా చెప్పలేదని తప్పుబట్టారు. ప్రసంగం మొదట్లో మోదీని విమర్శించి, అంతా అయ్యాకా మోదీని కౌగిలించుకోవడం చూస్తుంటే అదో నాటకంలా అనిపించిందని విమర్శించారు. వీళ్లెవరికీ ఏపీ ప్రజల మనోభావాలపై, సమస్యలపై చిత్తశుద్ధి లేదని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘువయ్య, పార్టీ స్పీకర్ ప్యానల్ సభ్యుడు అద్దేపల్లి శ్రీధర్ పాల్గొన్నారు.