YSRCP: వైసీపీ ఉచ్చులో చిక్కుకుంటారని చంద్రబాబుకు చెప్పాను.. అదే జరిగింది!: నరేంద్ర మోదీ
- హోదా విషయంలో వైసీపీ ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరించాను
- చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పినా వినిపించుకోలేదు
- రాష్ట్రాన్ని, ప్రజా ప్రయోజనాలనూ తుంగలో తొక్కి యూటర్న్
తన ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సమాధానం ఇస్తున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్యాకేజీకి అంగీకరించి, అదెంతో బాగుందని ప్రశంసించిన ఆయన, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి, అటు రాష్ట్రాన్ని, ప్రజా ప్రయోజనాలనూ తుంగలో తొక్కి, స్వార్థ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆనాడు తాను ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడిన మాట నిజమేనని, ఆపై మారిన పరిస్థితుల నేపథ్యంలో, ప్యాకేజీ గురించి మూడేళ్ల కిందటే చర్చించామని, హోదాతో కలిగే ప్రయోజనాలకు సమానమైన ఆర్థిక ప్రయోజనాలను అందించామని ఆయన అన్నారు. తాను తల్లిని చంపి బిడ్డను కాపాడారని అన్నానని, అదే నోటితో ఇప్పుడు తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడుదామని చెబుతున్నానని అన్నారు.
దాదాపు గంటన్నరకు పైగా మాట్లాడిన మోదీ, ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక హోదా గురించి పట్టుమని పది నిమిషాలైనా మాట్లాడలేదుగానీ, ఆ సమయంలోనే చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఏకేశారు. వాజపేయి హయాంలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే ఎలాంటి గొడవలు తలెత్తలేదని, కాంగ్రెస్ హయాంలోనే ఇలా జరుగుతున్నాయని అన్నారు. 2016 సెప్టెంబర్ లోనే తాము ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే, దాన్ని స్వాగతించిన చంద్రబాబు, అదే సంవత్సరం నవంబర్ 4న ఆయన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని స్వయంగా ప్రశంసించారని చెప్పారు.
విభజన హామీల అమలు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో సంయమనంతో వేచి చూశారని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేయలేదని, అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఉచ్చులో చిక్కుకున్నారని, దాన్నుంచి బయట పడాలని తాను చెప్పానని నరేంద్ర మోదీ లోక్ సభలో చెప్పారు. తాను స్వయంగా ఫోన్ చేసినా, చంద్రబాబు వినలేదని, మీ రెండు పార్టీల గొడవలో తనను లాగవద్దని కూడా అన్నానని, కానీ ఇప్పుడు అదే జరిగిందని అన్నారు.