Hyderabad: వైద్య చరిత్రలోనే అద్భుతం.. పావుకిలో బరువుతో పుట్టిన శిశువు..బతికించిన వైద్యులు!
- ఫిబ్రవరిలో జన్మించిన బిడ్డ
- నాలుగు వారాల ముందే డెలివరీ
- ప్రస్తుతం 2 కిలోలకు చేరుకున్న బరువు
వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతం. 375 గ్రాముల బరువు, 20 సెంటీమీటర్ల పొడవుతో పుట్టిన నవజాత శిశువు ఆరోగ్యం రోజురోజుకు వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ ఈ బిడ్డకు జన్మనిచ్చింది. కేవలం 25 వారాలకే (ఆరు వారాలు) శిశువు (చెర్రీ) జన్మించింది. అంటే డెలివరీ జరగాల్సిన సమయానికి నాలుగు నెలల ముందే జన్మించినట్టు వైద్యులు తెలిపారు. నిజానికి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు బతకడం దాదాపు అసాధ్యం. అటువంటిది వైద్యుల కృషితో నవజాత శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. రోజురోజుకు బరువు పెరిగింది. గతవారం బేబీ బరువు 2 కిలోలకు చేరుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
చెర్రీ (నవజాత శిశువు) తల్లి నికితది చత్తీస్గఢ్. చెర్రీ పుట్టడానికి ముందు నాలుగు సార్లు గర్భ స్రావమైంది. ఐదోసారికి విజయవంతమైంది. చెర్రీ కేసు చాలా క్లిష్టతరమైనదని వైద్యులు పేర్కొన్నారు. చిన్నారి పుట్టుకతోనే సమస్యలు చుట్టుముట్టాయన్నారు. పచ్చకామెర్లు, ఆహారం తీసుకోవడంలో సమస్య, కాలేయ సమస్యలు వేధించాయని తెలిపారు. తాము ఈ కేసును సవాలుగా తీసుకున్నామని రెయిన్బో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బేబీ పుట్టిన తర్వాత మూడు నాలుగు రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నామని వివరించారు. బ్రెయిన్లో బ్లీడింగ్ కాకపోవడంతో చిన్నారిని రక్షించడం సులభమైందన్నారు. బేబీ బతకడం వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన అని పేర్కొన్నారు.