Jagan: గత నాలుగేళ్లుగా మేము చెబుతున్న మాటలే గల్లా జయదేవ్ ప్రసంగం కాదా? అని అడుగుతున్నా: జగన్
- హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు
- గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ విషయాన్ని ప్రచారం చేశాం
- ఇదే విషయాన్ని గల్లా జయదేవ్ గుర్తు చేశారన్న జగన్
నిన్న లోక్ సభలో చంద్రబాబునాయుడి ప్రతినిధిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం, గత నాలుగేళ్లుగా తాము చెబుతున్నదేనని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వవద్దని ఎన్నడూ చెప్పలేదని తాము నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నామని, అవే మాటలను గల్లా జయదేవ్ లోక్ సభలో మాట్లాడారని, దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసినట్టు అవునా? కాదా? అని జగన్ ప్రశ్నించారు.
ఈ మాట తాను చంద్రబాబును సూటిగా అడుగుతున్నానని చెప్పారు. ప్రత్యేక హోదాకు సంబంధించి గల్లా జయదేవ్ చెప్పిన మాటలను, గత నాలుగేళ్లుగా తాము అసెంబ్లీలో, యువభేరిలో మాట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని అన్నారు. తాను ధర్నాలు, నిరాహార దీక్షలతో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చెబుతున్న అంశాలనే గల్లా గుర్తు చేశారని అన్నారు.
"అప్పట్లో మమ్మల్ని దారుణంగా వెక్కిరించారు, హోదా వేస్టని, కోడలు మగపిల్లాడిని కంటానంటే, అత్త వద్దంటుందా అన్న మాటలు... అదేమైనా సంజీవనా? అన్న వెటకారం... చూసి ఇప్పుడు నిజంగా విస్తుపోయే పరిస్థితి" అన్నారు. ఆపై అసెంబ్లీలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు పంచిన పుస్తకాన్ని చూపించారు జగన్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు ఉన్న తేడాను నాడు చూపిన చంద్రబాబు, ఇప్పుడు అదే హోదా కావాలని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని ప్రశ్నించారు.