sivasena: జంతువులను కాపాడుతూ, మనుషులను చంపే కసాయిలు ఈ దేశాన్ని పాలిస్తున్నారు: శివసేన తీవ్ర వ్యాఖ్యలు
- దేశ పాలకులకు జాలి, దయ లేదు
- ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉండటం కాదు
- ఎప్పటికైనా ప్రజలే సుప్రీమ్
జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే బీజేపీ, శివసేనల మధ్య సంబంధాలు తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. తమ పత్రిక సామ్నాలో శివసేన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. జంతువులను కాపాడుతూ, మనుషులను చంపే ఒక కసాయి ఈ దేశాన్ని పాలిస్తున్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి సామ్నా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశాన్ని పాలిస్తున్న వారిలో కనీస దయ, జాలి కూడా లేకుండా పోయాయని మండిపడింది. ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉండటం కాదని, మెజారిటీ అనేది తాత్కాలికం మాత్రమేనని... ఎప్పటికైనా ప్రజలే సుప్రీమ్ అని పేర్కొంది.
మరోవైపు బీజేపీతో తెగదెంపులు చేసుకునే విషయంలో తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని శివసేన నేతలు అంటున్నారు. నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీలంతా సభకు హాజరుకావాలని శివసేన విప్ జారీ చేసింది. బీజేపీ నేతల కోరిక మేరకే ఈ విప్ జారీ అయింది. కానీ అంతలోనే శివసేన అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చింది. చివరకు లోక్ సభకు నిన్న శివసేన దూరంగా ఉండిపోయింది. బీజేపీ అగ్రనేతలు అనుసరిస్తున్న తీరు పట్ల శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే గుర్రుగా ఉన్నట్టు సమాచారం.