Jagan: 'కేసీఆర్ హుందాతనం'పై స్పందించేందుకు నిరాకరించిన జగన్!
- కేసీఆర్ చాలా హుందాగా ప్రవర్తించారన్న నరేంద్ర మోదీ
- ఈ వ్యాఖ్యలపై స్పందించాలని జగన్ ను కోరిన మీడియా
- టాపిక్ డైవర్ట్ చేయవద్దంటూ హితవు
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ చాలా హుందాగా ప్రవర్తించారు" అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్ నిరాకరించారు. ఈ ఉదయం కాకినాడ సమీపంలో మీడియా సమావేశంలో పాల్గొన్న వేళ, ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఓ విలేకరి, జగన్ అభిప్రాయాన్ని కోరగా, పెద్దగా నవ్వి "టాపిక్ ను డైవర్ట్ చేయడం వద్దన్నా... ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ప్రెస్ మీట్ పెడతావున్నాం. ఇది వెరీ సీరియస్ మ్యాటర్. ఏ రకంగా డైవర్ట్ అయినా కూడా... ఈ మాటలే హైలైట్ అయితే, హోదా అన్న అంశం పక్కకు పోతుంది. కాబట్టి, మీరు అడిగిన దానికి సరైన సమయంలో సరైన రీతిలో చెబుతాను అన్నా" అని అన్నారు.
ఎవరు ప్రధానమంత్రి అయినా ఫర్వాలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరు సంతకం పెడితే వాళ్లకు మద్దతిచ్చేందుకు తాను సిద్ధమని చెప్పారు. మంగళవారం నాడు బంద్ జరిగే వేళ, తాను ఒక చోట కూర్చుని ఎక్కడ ఎలా జరుగుతుందో పర్యవేక్షిస్తానని చెప్పారు.