Amaravathi: రేపు అమరావతికి ప్రపంచ బ్యాంకు బృందం రాక!
- అమరావతిలో ఐదు రోజుల పర్యటన
- రహదారులు, ప్రాజెక్టుల పరిశీలన
- సంతృప్తి చెందితేనే రుణం
ఆదివారం నుంచి ఈ నెల 27 వరకు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిలో పర్యటించనుంది. రాజధానిలో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ప్రపంచబ్యాంకు రుణ సాయం అందించనుంది. ఈ నేపథ్యంలో తామిచ్చే రుణం ద్వారా చేపట్టనున్న రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులను బ్యాంకు ప్రతినిధులు పరిశీలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుల కోసం రూ.3,400 కోట్ల రుణం మంజూరు చేయాలంటూ ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు మూడేళ్ల క్రితమే కోరారు.
రాష్ట్రప్రభుత్వ కోరిక మేరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలుమార్లు రాజధానికి వచ్చి చర్చలు జరిపారు. సీఆర్డీఏ అధికారులు కూడా అమెరికా వెళ్లి బ్యాంకు ప్రతినిధులను కలిశారు. రుణ విడుదలకు మార్గం సుగమం అవుతున్న తరుణంలో రాజధానిలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ కొందరు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. దీంతో రుణ మంజూరీని నిలుపుదల చేసిన బ్యాంకు, రాజధాని వచ్చి మరోమారు ప్రాజెక్టులను పరిశీలించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు తామిచ్చే రుణంతో చేపట్టబోయే ప్రాజెక్టులను పరిశీలించనుంది. ఈ సందర్భంగా సీఆర్డీఏ అధికారులతోనూ బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.