Sanjay Dutt: ఓ తుపాకి నా అందమైన జీవితాన్ని నాశనం చేసింది: సంజయ్ దత్
- తుపాకిని ఇంట్లో పెట్టుకుని భారీ మూల్యం చెల్లించా
- నేను ఉగ్రవాదిని కాను
- మగాడిలా వచ్చి అరెస్టయ్యా
అందమైన తన జీవితాన్ని ఓ చిన్న తుపాకి సర్వనాశనం చేసిందని బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ దత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవిత కథ ఆధారంగా రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సంజు’ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుగొడుతోంది. ఈ సినిమా ‘ఖల్నాయక్’లోని పలు కోణాలను చూపించింది. తల్లిదండ్రులతో ఆయన సంబంధాలు, డ్రగ్స్‌కు బానిస కావడం, 1993 బాంబు పేలుళ్లు, జైలు జీవితం తదితర కోణాలన్నింటినీ చూపించింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సంజయ్ మాట్లాడాడు.
ఓ చిన్న తుపాకి తన జీవితాన్ని సర్వనాశనం చేసిందని అన్నాడు. తానేమీ ఉగ్రవాదిని కాదని, ఆయుధ చట్టం ప్రకారం జైలు శిక్ష అనుభవించానని తెలిపాడు. తానేమీ పారిపోలేదని, మగాడిలా వచ్చి అరెస్టయ్యానని పేర్కొన్నాడు. ‘‘తుపాకిని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా భారీ మూల్యం చెల్లించుకున్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై పేలుళ్లు, బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తుండడంతో కుటుంబాన్ని రక్షించుకునేందుకు తుపాకిని తన దగ్గర పెట్టుకున్నానని చెప్పిన సంజయ్ అది ఇంత పనిచేస్తుందని అనుకోలేదన్నాడు.
తన జీవితానికి సంబంధించి దర్శక నిర్మాతలకు ఉన్నది ఉన్నట్టు చెప్పేశానని, అందులోంచి తమకేం తీసుకోవాలో తీసుకోవచ్చని చెప్పేశానని సంజయ్ వివరించాడు. ఈ రోజు సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం తన నిజాయతీయేనని పేర్కొన్నాడు.