GST: తీపికబురు... మారిన జీఎస్టీ తరువాత ధరలు తగ్గిన 88 వస్తువుల వివరాలు!
- 28 శాతం జీఎస్టీ శ్లాబ్ తొలగించే దిశగా కీలక అడుగు
- మారిన 88 ప్రొడక్టుల శ్లాబులు
- రాఖీలు, చీపుర్లు, విస్తర్లపై సున్నా శాతం పన్ను
జీఎస్టీలో 28 శాతం శ్లాబ్ ను పూర్తిగా తొలగించే దిశగా మరో కీలక అడుగు పడింది. ఈ నెల 27 నుంచి కొత్త పన్ను రేట్లు అమలులోకి రానుండగా, 88 వస్తువులపై పన్ను రేటు తగ్గింది. ఈ తగ్గింపు కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు లాభం కలగనుంది. 27 అంగుళాల కన్నా చిన్న టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మిషన్లు సహా ఎన్నో వస్తువులపై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీ 18 శాతానికి దిగి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్, 28న జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో మరికొన్ని ప్రొడక్టుల రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
కొత్త మార్పుల కారణంగా ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల వరకూ ఆదాయం తగ్గనుందని, అయితే, ఆర్థిక వృద్ధిపైనే తాము దృష్టిని సారించామని గోయల్ వెల్లడించారు. 28 శాతం పన్ను శ్లాబ్ లో అతి కొద్ది ఉత్పత్తులు మాత్రమే మిగిలాయని ఆయన అన్నారు.
పన్ను రేటు తగ్గిన ప్రొడక్టుల్లో ఇథనాల్, రూ. 1000 లోపు ధర ఉన్న పాదరక్షలు, ఈ-బుక్స్, పోషకాలు కలిపిన పాలు, స్మారక నాణాలు, శానిటరీ నాప్కిన్లు ఉన్నాయి. హోటళ్లలో రూములు తీసుకుంటే రూ. 7,500 కన్నా ఎక్కువ అద్దె అయితే 28 శాతం, రూ. 2,500 నుంచి రూ. 7,500 మధ్య అయితే 18 శాతం, రూ. 1000 నుంచి రూ. 2,500 మధ్య అయితే 12 శాతం పన్ను ఉంటుంది. హ్యాండ్ బ్యాగులు, ఆభరణాలు, ఫ్రేమ్ కలిగిన అద్దాలు, చేతితో తయారయ్యే దీపాలు, నగలు దాచుకునే పెట్టెలపై 12 శాతానికి జీఎస్టీ రేటు తగ్గగా, రూ. 1000 లోపు విలువైన అల్లిక వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. హస్తకళతో తయారైన చిన్న వస్తువులు, రాతి, చెక్క, పాలరాయి విగ్రహాలు, రాఖీలు, చెట్ల ఆకుల నుంచి తయారైన విస్తర్లు, చీపురు కట్టలపై జీఎస్టీని పూర్తిగా తొలగిస్తున్నట్టు పేర్కొంది.
ఇక 28 నుంచి 18 శాతానికి పన్ను రేట్లు తగ్గిన ప్రొడక్టుల్లో వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, 27 అంగుళాల కన్నా చిన్న టీవీలు, ఐరన్ బాక్సులు, వీడియో గేమ్స్, వాక్యూమ్ క్లీనర్లు, కంటెయినర్లు, మిక్సీలు, గ్రైండర్లు, షేవింగ్ పరికరాలు, హెయిర్ డ్రయ్యర్లు, వాటర్ కూలర్లు, స్టోరేజ్ వాటర్ హీటర్లు, పెయింట్లు, వాల్ పుట్టీలు, వార్నిష్ లు, లీథియం అయాన్ బ్యాటరీలు, పర్ఫ్యూమ్ లు, టాయిలెట్ స్ప్రే తదితరాలు ఉన్నాయి.