Bay Of Bengal: రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు: హెచ్చరించిన వాతావరణ శాఖ
- బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం
- పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
- ఏపీ పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
వచ్చే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యధిక ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడమే ఇందుకు కారణమని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై అధికంగా ఉంటుందని తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని, మత్స్యకారులు వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లవద్దని సలహా ఇచ్చారు. కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.