trump: ట్రంప్ కు పుతిన్ ఇచ్చిన బహుమతిపై అనుమానం.. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజన్సీ తనిఖీలు!
- ఇటీవల ఫిన్లాండ్ లో ఈ బహుమతినిచ్చిన పుతిన్
- సెనేటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యల నేపథ్యంలో తనిఖీలు
- ఈ బంతిని తనిఖీలు చేస్తామన్న సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు ఇటీవల ఫిన్లాండ్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2018 వరల్డ్ కప్ సాకర్ బంతిని ట్రంప్ కు పుతిన్ బహుమతిగా అందజేశారు. ఈ బంతిని సైతం అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ తనిఖీలు చేయకుండా వదలలేదు.
ఫిన్లాండ్ లో ట్రంప్-పుతిన్ లు ఇటీవల నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ‘బంతి రష్యా కోర్టులో ఉందా?’ అని పుతిన్ ని ఓ విలేకరి ప్రశ్నించగా, ‘వరల్డ్ కప్ సాకర్ ను విజయవంతంగా పూర్తి చేశామని ట్రంప్ ఇప్పుడే చెప్పారు’ అని పేర్కొన్న పుతిన్.. ‘మిస్టర్ ప్రెసిడెంట్ ఈ బంతిని మీకు ఇస్తున్నాను. బంతి ఇప్పుడు మీ కోర్టులో ఉంది’ అంటూ 2018 వరల్డ్ కప్ సాకర్ బాల్ ను ట్రంప్ కు అందజేశారు. ‘ఈ బంతి మా అబ్బాయి బారన్ వద్దకు వెళుతుంది’ అని చెప్పిన ట్రంప్ దానిని తన సహాయకులకు అందజేశారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ అందుకున్న బహుమతిపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం స్పందిస్తూ, ‘అదే నేను ట్రంప్ స్థానంలో వుంటే కనుక ఆ బంతిలో ఏమైనా వినికిడి సాధనాలను అమర్చారేమో వెతుకుతాను. వైట్ హౌప్ లోకి మాత్రం దీనిని అస్సలు అమనుతించను’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఈ బంతిని పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తామని పేర్కొంది. ఇకపై, అధ్యక్షుడు ట్రంప్ కు వచ్చే ప్రతి బహుమతికి భద్రతా పరమైన తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొంది.