Rahul Gandhi: ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఫైనల్.. సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం
- వచ్చే ఎన్నికల్లో రాహులే ప్రధాని అభ్యర్థి
- వ్యక్తులపై కాకుండా భావజాలంపై పోటీ చేస్తామని ప్రకటన
- కూటముల ఏర్పాటుపై సర్వాధికారాలు రాహుల్‌కే
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైనల్ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు తీసుకున్నాక ఆదివారం తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో ముందుకు వెళ్లనున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో తాము వ్యక్తులతో పోటీ పడబోమని, భావజాలంతో పోటీ పడతామని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిలువునా కాలరాస్తున్న అధికార పార్టీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఏర్పాటు చేయబోయే కూటముల విషయంలో సర్వాధికారాలు రాహుల్‌కే అప్పగించినట్టు చెప్పారు.
గత ఎన్నికల్లో తమకు తక్కువ సీట్లు వచ్చిన మాట నిజమేనని, అంతమాత్రాన తామేమీ తక్కువ కాదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము 200 సీట్లు సాధిస్తే, తమతో వచ్చే పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని సూర్జేవాలా తెలిపారు. అప్పుడు రాహులే ప్రధాని అభ్యర్థి అవుతారని స్పష్టం చేశారు.