Helmet: వాహనదారుల నెత్తికి బిగ్ రిలీఫ్.. తగ్గనున్న హెల్మెట్ బరువు!
- 300 గ్రాములు తగ్గనున్న హెల్మెట్ల బరువు
- బైక్ తయారీదారులు కూడా ఉత్పత్తి చేయాలని ఆదేశం
- 1.2 కిలోలకు తగ్గనున్న హెల్మెట్
ద్విచక్ర వాహనదారులకు ఇది గొప్ప శుభవార్తే. హెల్మెట్ రూపంలో నెత్తిపై కిలోన్నర బరువు మోస్తున్న వారికి బిగ్ రిలీఫ్. ఇకపై ఈ బరువును 1.2 కిలోలకు తగ్గించాలని ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ నిర్ణయించింది. ఈ మేరకు హెల్మెట్ల ఉత్పత్తిదారులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని యోచిస్తున్న ప్రభుత్వం.. బైక్ ఉత్పత్తిదారులు కూడా హెల్మెట్లను తయారుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం హెల్మెట్లు ఉండేలా వాటిని ఉత్పత్తి చేయాలని సూచించింది.
నాణ్యత లేని హెల్మెట్ల కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హెల్మెట్లు ధరించని కారణంగా గతేడాది ఏకంగా 15 వేల మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో 70 శాతం మంది ద్విచక్ర వాహనదారులేనని తేలింది. దీంతో నాణ్యతతోపాటు బరువు కూడా తక్కువ ఉన్న హెల్మెట్లను ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.