Pawan Kalyan: రాజ్యసభ సీటు ఇస్తానన్న చంద్రబాబు... మరుసటి రోజే లీకులిచ్చారు!: పవన్ సంచలన వ్యాఖ్యలు
- 2012లోనే చంద్రబాబును కలిశా
- ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటుపై హామీ ఇచ్చి మోసం
- అప్పుడే చంద్రబాబుపై నమ్మకం పోయిందన్న పవన్
2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులిచ్చి విషయాన్ని బయటకు పొక్కేలా చేశారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తన అమరావతిలో పర్యటనలో ఆయన మాట్లాడుతూ, తనకు తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపైన ఆరోజే నమ్మకం పోయిందని, ఆ తరువాతే తాను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని కలిశానని అన్నారు.
అంతకు రెండేళ్ల ముందే చంద్రబాబును కలిసి రాజకీయ పార్టీ గురించి చర్చిస్తే, ఓట్లు చీలుతాయని ఆందోళనపడిన ఆయన, పోటీ వద్దని సూచించారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ ఒక్కరికే ఉద్యోగం వచ్చిందని వ్యాఖ్యానించిన పవన్, ఉపాధి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. లోకేష్ సీఎం అయితే తనకేమీ అభ్యంతరం లేదుగానీ, రాష్ట్రం ఏమవుతుందోనన్న భయం మాత్రం ఉందని విమర్శలు గుప్పించారు. పుట్టుకతోనే ఎవరికీ రాజకీయ అనుభవం ఉండదని, తనకు రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తున్న వారికి చురకలు అంటించారు. కిందపడ్డా, పైకి ఎక్కినా చివరకు అధికారం జనసేన పార్టీదేనని అన్నారు.