Krishna River: ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నిండుకుండలు... ఇన్ ఫ్లో వివరాలు!
- గత వారం పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు
- కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ ఫుల్
- వచ్చిన నీటిని వచ్చినట్టు వదులుతున్న అధికారులు
గత వారంలో పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలకు భారీ ఎత్తున వరద వస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండుకుండల్లా మారగా, వస్తున్న వరదను వస్తున్నట్టు శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. అన్ని ప్రాజెక్టులకు ఉన్న పంట కాలువలకూ సమృద్ధిగా నీరు వెళుతోంది. ఈ ఉదయం ఆల్మట్టికి 1,63,478 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతమొత్తం నీటినీ దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ కు 1,68,565 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,69,388 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాలకు 1,84,263 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,84,738 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయానికి 52,083 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 49,519 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఈ నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. మొత్తం 215.81 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న జలాశయంలో ప్రస్తుతం 53.85 టీఎంసీల నీరుంది. 1,83,410 క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వచ్చి ప్రాజెక్టులో కలుస్తుండగా, కేవలం 78 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా, నాగార్జున సాగర్ కు నామమాత్రంగా 1,595 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఏలేరు జలాశయానికి 5,357 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 150 క్యూసెక్కులను వదులుతున్నారు. మిగతా ప్రాజెక్టులకు చెప్పుకోతగ్గ వరద లేదు.