Paritala Sunita: "రేయ్... ఇక్కడే ఉంటే తంతా"... పిల్లాడికి పరిటాల సునీత వార్నింగ్!
- 'అన్న క్యాంటీన్'ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పరిటాల సునీత
- ప్లేట్లు అందిస్తూ కనిపించిన బాల కార్మికుడు
- బడికి పోలేదా? అంటూ పలకరించిన సునీత
- బాలలను పనిలో పెట్టుకోవద్దని నిర్వాహకులకు హెచ్చరిక
అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన 'అన్న క్యాంటీన్'ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వెళ్లిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని పలకరించారు.
ఆపై "ఏరా... బడికిపోలేదా? ఇక్కడే ఉంటే తంతా" అంటూ వార్నింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవద్దని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు. ఆ తరువాత ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని, అందరితోపాటు భోజనం చేశారు. అక్కడికి వచ్చిన వారికి కాసేపు అన్నం వడ్డించారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ క్యాంటీన్ లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, పేదల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. క్యాంటీన్లకు వచ్చే వారిని గౌరవంగా చూసుకోవాలని నిర్వాహకులకు పరిటాల సునీత సూచించారు.