Bigg Boss: ఫేక్ ఐ ఫోన్లు అమ్మిందంటూ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై కేసు నమోదు
- రెండు సంస్థలకు అంబాసిడర్‌గా బంగ్డీ కల్రా
- ఐఫోన్ ఎక్స్ రూ.61 వేలే అంటూ పోస్ట్
- ఆశపడి కొన్న వినియోగదారుడికి షాక్
బిగ్‌బాస్ -2 కంటెస్టెంట్, నటి బంగ్డీ కల్రాపై కేసు నమోదైంది. తనకు ఫేక్ ఐఫోన్లు విక్రయించిందంటూ బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి కల్రాతోపాటు ఢిల్లీకి చెందిన డిఫరెంట్ కలెక్షన్, నెక్సాఫేషన్ డాట్ కామ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంస్థలకు కల్రా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
బెంగళూరు శివారులోని మరథహళ్లికి చెందిన యువరాజ్ సింగ్ యాదవ్.. నటి కల్రా ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూశాడు. అందులో రెండు కొత్త ఐఫోన్ ఎక్స్ మొబైళ్లు రూ.61 వేలకే అందుబాటులో ఉన్నట్టు ఉంది. ఇదేదో బాగానే ఉందని భావించిన యువరాజ్ సింగ్ పేటీఎం ద్వారా రూ.13 వేలు చెల్లించి వాటిని బుక్ చేసుకున్నాడు. తర్వాత తనకు పార్శిల్ రావడంతో మిగతా డబ్బులు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. అనంతరం పార్శిల్ విప్పి చూడగా అందులో రెండు నకిలీ ఐఫోన్లు కనిపించాయి. దీంతో నిశ్చేష్టుడైన యువరాజ్ సింగ్ వెంటనే నటికి, ఆయా సంస్థలకు ఫోన్ చేశాడు. అయితే, వారి నుంచి అతడికి స్పందన రాలేదు. దీంతో మరథహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కల్రాకు, బాధితుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కల్రా తన ఈమెయిల్ ఐడీతోపాటు పైన పేర్కొన్న రెండు సంస్థల ఈమెయిల్ ఐడీలను బాధితుడికి పంపింది. నటి ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫేక్ కాదని తేలడంతో కల్రాతోపాటు రెండు సంస్థలను విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఢిల్లీ పంపినట్టు పేర్కొన్నారు.