Chatthiesghad: చత్తీస్ గఢ్ లో మద్య నిషేధం తెస్తాం... వారు మాత్రం తాగొచ్చు!: మాజీ సీఎం అజిత్ జోగి
- గిరిజనులకు మాత్రం మినహాయింపు
- మద్యం వారి సంస్కృతిలోనే ఉందన్న అజిత్ జోగి
- అన్ని సీట్లలోనూ పోటీ చేస్తామని వెల్లడి
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో తన పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం తెస్తామని వాగ్ధానం చేసిన మాజీ సీఎం అజిత్ జోగి, రాష్ట్రంలోని గిరిజనులకు మాత్రం మద్యపానానికి అనుమతి ఇస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో మద్యం పెనవేసుకుపోయిన అంశమని, అది వారి సంప్రదాయమని చెప్పిన అజిత్ జోగి, తమ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లలోనూ పోటీ చేస్తుందని తెలిపారు.
తాను సీఎం అయితే గిరిజన ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్లా మద్యం కనిపించకుండా చేస్తానని తెలిపారు. కొన్ని కుటుంబాల్లో సంపాదనంతా లిక్కర్ కొనేందుకే సరిపోతోందన్న ఫిర్యాదులు మహిళల నుంచి వస్తున్నాయని గుర్తు చేసిన ఆయన, అందువల్లే ఈ హామీ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాధికారిగా ఉండి, ఆపై రాజకీయ నాయకుడిగా మారిన అజిత్ జోగికి, గిరిజన వర్గాల్లో మంచి పట్టు ఉంది. గిరిజనుల ఆరోగ్యంపై ప్రశ్నించగా, వారుండే ప్రాంతాల్లో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని జోగి చెప్పడం గమనార్హం.